ఆ రెండు సినిమాల్ని కలిపితే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ !


‘ప్రేమమ్’ వంటి సక్సెస్ తో మంచి జోరుమీదున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఈ చిత్ర నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘ఒక అమ్మాయి తనకు కాబోయే రాకుమారుడు ఎలా ఉంటాడో అని కలలు కంటూ ఉంటుంది. ఆ రాకుమారుడు ఎలా ఉంటాడు అనేదే ఈ సినిమా కథ’ అంటూ ఒక్క వాక్యంలో సినిమా థీమ్ ని ఆసక్తికరంగా వివరించారు.

అలాగే తన కెరీర్లో చేసిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో ఫ్యామిలీ డ్రామా ఉంటుందని, ‘మన్మధుడు’ లో ఒక సున్నితమైన ప్రేమ కథ ఉంటుందని చెబుతూ ‘ఆ రెండు సినిమాలాంటే నాకెంతో ఇష్టం. వాటి రెండింటినీ కలిసి ఒక కథ చేయమని కళ్యాణ్ కృష్ణకు చెప్పాను. అప్పుడు కళ్యాణ్ ఈ కథతో వచ్చాడు. నాకది చాలా నచ్చింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మాకు నచ్చకుండా సినిమా రిలీజ్ చేయను’ అంటూ సినిమాపై తన గట్టి నమ్మకాన్ని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని మే నెల మూడవ వారంలో రిలీజ్ చేస్తామని కూడా నాగ్ తెలిపారు.