నాగార్జున 23న అభిమానులకు ఇస్తానన్న సర్ ప్రైజ్ ఇదేనేమో..!

naga
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ట్రెండుకి తగ్గట్టు రూట్ మార్చి సక్సెస్ రేటును అమాంతం పెంచేసుకున్న హీరో ‘అక్కినేని నాగార్జున’. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో యువతరం హీరోలకన్నా చాలా ముందున్న ఈయన చిన్న సినిమాలని సైతం బాగానే ప్రోత్సహిస్తున్నారు. మునుపు ఉయ్యాలా జంపాలా వంటి చిన్న చిత్రాన్ని నిర్మించిన ఈయన తాజాగా శ్రీకాంత్ కుమారుడు ‘రోషన్’ ను హీరోగా పరిచయం చేస్తూ జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో ‘నిర్మలా కాన్వెంట్’ ను నిర్మిస్తున్నారు.

ఇదివరకే రిలీజైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో నాగార్జున కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవనుందని కూడా తెలుస్తోంది. ఇకపోతే నాగార్జున ట్విట్టర్ లో ఈ చిత్రం టీజర్ ఒకదాన్ని అప్లోడ్ చేసి 23న అభిమానులందరికీ ఓ సర్ ప్రైజ్ ఇస్తానన్నారు. దాంతో అభిమానవుల్లో నాగ్ మాటల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. అయితే నాగ్ ఇస్తానన్న సర్ ప్రైజ్ చిత్రంలోని ఆయన పాత్రకు సంబందించిన ఏదైనా కీలక టీజర్ కానీ, పాట గాని అయి ఉంటుందని కొందరు అభిమానులు అనుకుంటుంటే, కాదు నాగార్జున 23 వ తేదీన తన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ప్రేమ వివాహాలకు సంబందించి ఏదైనా కొత్త విషయాన్ని చెబుతారని కొందరు అనుకుంటున్నారు. వీటిలో ఏది నిజమవుతుందో చూడాలంటే 23 సాయంత్రం వరకూ ఆగాల్సిందే మరి.