మహాబలేశ్వరం వెళ్ళిపోయిన నాగార్జున..!
Published on Oct 9, 2016 11:50 am IST

Nagarjuna
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం మహాబలేశ్వరంలో షూటింగ్ జరుపుకుంటోంది. మంచు కురుస్తుండగా, అక్కడి కొండ ప్రాంతాల్లో నాగార్జున షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

మరో షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, ఫిబ్రవరి నెల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగార్జున భావిస్తున్నారట. ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లో తనదైన స్థానం సంపాదించుకున్న నాగార్జున, ఓం నమో వెంకటేశాయ, ఆ స్థాయిని మరింత పెంచేదిగా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు