సుమంత్ సినిమా ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేయనున్న నాగ్!

nagarjuna

అక్కినేని హీరో సుమంత్ కెరీర్ మొదట్లో పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించినా, ఆ తర్వాత పూర్తిగా నెమ్మదించారు. 2014లో ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే సినిమా తర్వాత సుమంత్ మళ్ళీ కనిపించలేదు. కాగా ఈసారి ఎలాగైనా బలమైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో కావాలనే సుమంత్ ఈ గ్యాప్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాను సుమంత్ రీమేక్ చేశారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

‘నరుడా డోనరుడా’ అన్న ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అక్కినేని నాగార్జున ఈ సాయంత్రం లాంచ్ చేయనున్నారు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీర్యం దానం చేసే ఓ సరికొత్త పాత్రలో సుమంత్ ఈ సినిమాలో కనిపిస్తారు. డోనార్ అంటే దానం చేసేవాడనే అర్థం కావడంతో నరుడా డోనరుడా అనే కథకు సరిపడే టైటిల్‌ను సెలెక్ట్ చేశారట. సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఓ కీలక పాత్రలో నటించారు.