మహేష్‌తో కలిసి నటించడం లేదన్న నమ్రత!

14th, August 2016 - 12:22:21 PM

Namrata
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌతిండియన్ పాపులర్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ భార్య నమ్రత ఓ కీలక పాత్రలో నటించనున్నారని కొద్దిరోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. మహేష్-నమ్రత కలిసి గతంలో ‘వంశీ’ అనే సినిమాలో నటించగా, మళ్ళీ ఇన్నాళ్ళకు వీరిద్దరూ కలిసి నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది.

కాగా ఈ ప్రచారాలన్నీ అబద్ధమని, తాను మహేష్ సినిమాలో నటించడం లేదని నమ్రత స్పష్టం చేశారు. నిన్న హైద్రాబాద్‌లో జరిగిన ఓ మ్యాగజైన్ లాంచ్‌కు విచ్చేసిన నమ్రత, ఈ సందర్భంగా మహేష్ సినిమాలో నటిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ఇలాంటి తప్పుడు వార్తలన్నీ ఎవరు సృష్టిస్తారో అర్థం కాదని, ఇలాంటి వార్తలు రాసేముందు ఆలోచించుకోవాలని అన్నారు. ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే ఎన్.వి.ప్రసాద్-ఠాగూర్ మధు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శక నటుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.