అస్సాంలో సంభవించిన వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. శ్రీమతి నందమూరి బసవరామ తారకం శతజయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ ట్రస్ట్ ద్వారా ఆహార పదార్థాలు, దుస్తులు, తాగునీరు వంటి నిత్యావసర వస్తువులను సేకరించి ఒక ట్రక్కు ద్వారా అస్సాంకు పంపించారు. ‘ది ఎంబ్రియోస్’ (THE EMBRYOS) అనే ఎన్జీఓ సంస్థ సహకారంతో బాధితులకు ఈ సరుకులను నేరుగా పంపిణీ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, ఖమ్మంతో పాటు విదేశాల నుంచి కూడా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని నిర్వాహకులు వెల్లడించారు. సమాజ సేవే ధ్యేయంగా, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ట్రస్ట్‌ను స్థాపించినట్లు నిర్మాత, సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ తెలిపారు. బాధితులకు అండగా నిలిచేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం అందుతున్న సహాయక వివరాలను తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా పంచుకుంటామని, మరిన్ని నిత్యావసర వస్తువులను త్వరలోనే అస్సాం బాధితులకు అందజేస్తామని నందమూరి మోహన్ రూపా, సీమంతిని పేర్కొన్నారు.
