ఇంటర్వ్యూ : కథ పూర్తిగా వివరించక ముందే నిన్నుకోరి చిత్రానికి ఓకే చెప్పేశా – నాని
Published on Jul 4, 2017 8:22 pm IST

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నాని చిత్రాలు వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం ‘నిన్నుకోరి’ చిత్రం ద్వారా నాని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తుందా ఆది ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర విడుదల సందర్భంగా నాని ఇంటర్వ్యూలో చిత్రం గురించి అనేక విషయాలు వెల్లడించాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ప్ర )నిన్నుకోరి లాంటి చిత్రం చేయాలని ఎలా అనిపించింది ?

జ) దర్శకుడు పూర్తిగా కథని వివరించక ముందే ఈ చిత్రానికి ఒకే చెప్పేశాను. ఇందులో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఉన్నట్లుగా అనిపించింది. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా శివ మంచి స్క్రిప్ట్ ని తయారు చేశాడు. అంతేకాక ఈ చిత్రం లో రొమాంటిక్ యాంగిల్ బాగా ఆకట్టుకుంటుంది.

ప్ర) తొలిసారి దర్శకత్వం వహిస్తున్న శివతో పనిచేయడం ఎలా అనిపించింది ?

జ) తాను చెప్పాలనుకున్న కథని శివ నాకు నిజాయతీగా వివరించాడు. అతడు చాలా ఫోకస్ గా పనిచేసే దర్శకుడు. షూటింగ్ సమయంలో చిత్రం గురించి అతడు నాతో చర్చించేవాడు. ఏవైనా మార్పులు చేయాలన్నా యూనిట్ సభ్యులందరితో చర్చించి చేసేవాళ్లం.

ప్ర) నివేద థామస్ పెర్ఫామెన్స్ గురించి..?

) ఈ చిత్రం ఓకే అయిన తరువాత చాలా మంది హీరోయిన్లను అనుకున్నాం. కానీ ఈ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించగల నటి కావాలనుకున్నప్పుడు మాత్రం నివేద థామస్ నే తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే నివేద అద్భుతంగా నటించింది.

ప్ర) వరుసగా ప్రేమకథలే చేస్తున్నాని మీకు అనిపించడం లేదా ?

జ) దాదాపుగా తెలుగు చిత్రాలన్నింటిలోను ప్రేమ కథ చొప్పించి ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రమే కనిపిస్తాయి. అదే నా చిత్రాల విషయంలో కూడా జరుగుతోంది. కానీ ఇంతవరకు ‘నిన్ను కోరి’ లాంటి పూర్తి ప్రేమకథా చిత్రాన్ని చేయలేదు.

ప్ర) మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నారు ?

జ) ఆ క్రెడిట్ ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ అందించిన నీరజా కోనా కు చెందుతుంది. యూఎస్ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో నా స్టైల్ ని కొంత మార్చాను. నా లుక్ కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది.

ప్ర) ఆదితో కలసి పనిచేయడం గురించి ?

జ) ఈ చిత్రానికి నేను, నివేద ఓకే అయిన తరువాత మరో కీలక పాత్రలో నటించే వ్యక్తి కోసం ప్రయత్నించాం. అందరూ ఆ పాత్రకోసం ఆది అయితే సరిపోతాడని సలహా ఇచ్చారు. ఆదితో కలసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. ఈ చిత్రంలో ఆదిని సరికొత్త యాంగిల్ లో చూస్తారు. అద్భుతమైన ఫెర్ఫామెన్స్ తో ఆది సర్ప్రైజ్ చేయడం ఖాయం.

ప్ర) మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. దాని గురించి ?

జ) గోపిసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నేను మొదటి సారి ‘అడిగా’ సాంగ్ విన్నప్పుడు ఈ పాటని టీజర్, ఆడియో కంటే ముందే విడుదల చేయాలని భావించాను. అదే విషయాన్ని చిత్ర యూనిట్ కి కూడా వివరించాను. అనున్నట్లుగా ఆ పాట పెద్ద హిట్ అయింది. మిగిలిన పాటలుకూడా అద్భుతంగా వచ్చాయి. నిన్నుకోరి చిత్రానికి సంగీతమే చాలా కీలకం.

ప్ర) నిన్నికోరి చిత్రం మీ విజయపరంపరని కొనసాగిస్తుందా ?

జ) దాని గురించి నేనే చెప్పగలనా ?. విజయాలు కొనసాగాలని ఆశిస్తున్నాను. కానీ నేను కూడా మనిషినే. ఏదో ఒకరోజు విజయాలకు అడ్డుకట్ట పడొచ్చు. ఇండస్ట్రీ లో ఏది శాశ్వతం కాదు. నేను అన్నింటికీ సిద్దపడే ఉన్నాను.

ప్ర) మీకు కొడుకు పుట్టాక లైఫ్ ఎలా ఉంది ?

జ) ఇప్పటి వరకు అంతా బాగానే సాగుతోంది. ప్రస్తుతానికి అర్జున్( నాని కొడుకు పేరు) మరియు నా కెరీర్ పైనే ఫోకస్ పెట్టాను. షూటింగ్ పూర్తవగానే ఇంటికి వెళ్లి వాడితో ఆడుకుంటాను.

ప్ర) ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ?

జ) ప్రస్తుతం దిల్ రాజు గారి ‘ఎమ్ సి ఏ’ చిత్రం లో నటిస్తున్నాను. ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుంది. ఈ రెండు చిత్రాల తరువాత హను రాఘవాపుడితో కలసి మళ్లీ పనిచేస్తాను.

 
Like us on Facebook