నాని ‘మజ్నూ’ రిలీజ్ ఎప్పుడంటే..!

nani
నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని గత నెలలో విడుదలైన ‘జెంటిల్‌మన్’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు. ‘ఉయ్యాల జంపాల’తో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మతో సినిమా చేస్తోన్న నాని, అప్పుడే ఈ సినిమాకు విడుదల తేదీని కూడా దాదాపుగా ఖరారు చేసేశారు.

సెప్టెంబర్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా నిర్మాత కిరణ్ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ కూడా సగం భాగం పైగా పూర్తైందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘మజ్నూ’ అన్న పేరును పరిశీలనలో ఉంచారు. దాదాపుగా ఇదే పేరు ఖరారు కానుందని సమాచారం. నాని ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాని స్టైల్లో కామెడీకి పెద్ద పీట వేసే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రచారం పొందుతోంది.