నారా లోకేష్ చేతుల మీదుగా ‘జై సింహా’ ఆడియో !

నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈరోజు చిత్ర ఆడియో కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇదివరకే విడుదలై టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

ఇకపోతే ఈ ఆడియో వేడుకకు బాలకృష్ణ అల్లుడు, ఏపి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా విచ్చేసి పాటలను రిలీజ్ చేయనున్నారు. దీంతో అటు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వేడుకకు భారీ ఎత్తున హాజరుకానున్నారు. సి.కళ్యాణ్ నిర్మాణంలో కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తుండగా చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.