మా మధ్య విభేదాలు సృష్టించొద్దు – నారా రోహిత్

తమ కుటుంబలో విభేదాలు ఉన్నాయని కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం నీచమైన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని నారా రోహిత్ ఫైర్ అయ్యారు. నారా మాటల్లో.. ‘రాష్ట్ర అభివృద్ధికి నారా పేరును బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంలో చంద్రబాబునాయుడు కృషి అభినందనీయం. మా నాన్న రాంమూర్తినాయుడు, పెదనాన్న రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం బాధకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించవద్దు.

నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. అందుకే మేము క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబం పై, మా రిలేషన్స్‌ పై బురద చల్లకండి. నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలు, పంచాయితీ భవనాలకు విరాళంగా ఇచ్చాం. మాకు రాష్ట్రాభివృద్దే ముఖ్యం. మా కుటుంబాన్ని మా పెదనాన్న నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం. అసత్యం. రాత్రింబవళ్ళు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా చూసుకుంటున్నారో.. అదే విధంగా మమ్మల్ని కూడా చూసుకొంటున్నారు.

ఎంపీ పదవి కోసం సొంత బాబాయి పై చేయి చేసుకొన్న చరిత్ర మాది కాదు. అది వైఎస్ కుటుంబ చరిత్ర. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అలాంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు కుటుంబ బాంధవ్యాల విలువ తెలుసా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పై నారా రోహిత్ విరుచుకుపడ్డారు. ప్రతీ ఏడాది మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకొంటారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఓ కుటుంబ పెద్దలా గడుపుతున్నారు. మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాకు ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్యం సరిగా లేని కారణంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అని నారా రోహిత్ తెలియజేశారు.

Exit mobile version