అహింస, శాకాహార ప్రచారమే లక్ష్యంగా ఐదు రోజుల పాటు జాతీయ ధ్యాన సభలు

National Ahimsa Dhyana Mahasabhalu

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభలను నిర్వహిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు కార్యక్రమానికి సంబంధించిన లోగో, బ్రోచర్‌లను ఆవిష్కరించారు.

జీవుల పట్ల కరుణ, ధ్యానం, శాకాహార జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ సభలను ‘అహింసా కుంభమేళా’గా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆచార్య శ్రీనివాస్ తెలిపారు. ఈ మహాసభలకు నటుడు ఉపేంద్ర, బాబా రాందేవ్, మేనకా గాంధీ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటి రోజా రమణి మాట్లాడుతూ.. ధ్యానం, శాకాహారం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అహింసా భావనలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

మారుతున్న జీవనశైలిలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలకు శాకాహారం, ధ్యానం సరైన పరిష్కారాలని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాసభలను ప్రజలు విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Exit mobile version