వీక్ డేస్‌లోనూ ‘నేను లోకల్‌’ది అదే జోరు!

8th, February 2017 - 08:38:33 AM


న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. నానికి డబుల్ హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందన్న ప్రచారంతో వచ్చిన ఈ సినిమా నిజంగానే హిట్‌గా నిలవడంతో పాటు ఆయనకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, యూఎస్‌లోనూ ఐదు రోజుల కలెక్షన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం తర్వాత నేను లోకల్ జోరు కొనసాగిస్తుందా అన్న ప్రశ్న మొదట్లో కనిపించింది.

కాగా ‘నేను లోకల్’ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోమ, మంగళవారాల్లోనూ సూపర్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే 20కోట్ల షేర్ మార్క్‌కు దగ్గరైన ఈ సినిమా, ఈవారం విడుదలవుతోన్న ‘సింగం 3’, ‘ఓం నమో వెంకటేశాయ’లతో పోటీ పడి ఈ వీకెండ్‌కి కూడా మంచి వసూళ్ళు సాధిస్తే బ్లాక్‌బస్టర్ స్థాయి సినిమాగా నిలవనుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు.