నటసింహం నందమూరి బాలకృష్ణ తన 111వ చిత్ర షూటింగ్‌ను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇటీవలె ప్రారంభించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, బాలయ్య తన తదుపరి చిత్రం (NBK 112) విషయంలో పెట్టిన ఒక కండిషన్ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తన 112వ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని బాలకృష్ణ పట్టుబట్టడమే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన మైత్రీ నవీన్, ఎస్. నాగవంశీ, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలతో వరుస భేటీలు నిర్వహించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన లైన్ బాలయ్యకు బాగా నచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా కథా స్పాన్ చాలా పెద్దది కావడంతో, దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే, ఇంత భారీ బడ్జెట్ మరియు భారీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఉన్న సినిమాను 2027 సంక్రాంతి కల్లా పూర్తి చేయడం సాధ్యం కాదని నిర్మాతలు భావిస్తున్నారు.
మరోవైపు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ.. బాలయ్య కోసం హరీష్ శంకర్ లైన్‌ను సిద్ధం చేశారు. హరీష్ శంకర్ సినిమాలను వేగంగా పూర్తి చేయగలరనే నమ్మకంతో బాలయ్య కూడా ఆ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుల భవితవ్యం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫలితం మరియు ఇతర సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, తన 112వ సినిమాతో 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గర్జించాలని బాలయ్య గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
