‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్ కొత్త సినిమా షురూ..!

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 10గా రూపొందనున్న కొత్త చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. శ్రీ పుష్కూర్ రామ్మోహన్ రావు, శ్రీ భరత్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ సాయిలు కాంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

​హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో చిత్ర యూనిట్ మరియు పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో సదానంద్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందించగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ హీరో అడివి శేష్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, దర్శకుడు సాయిలు కాంపాటి మొదటి షాట్‌ను డైరెక్ట్ చేశారు.

​’మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఒక చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా తెరకెక్కనుంది. సుమంత్ ప్రభాస్ ఎంతో సందడిగా, వినోదాత్మకంగా ఉండే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, మిగిలిన నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version