‘శ్రీరస్తు శుభమస్తు’కి కొత్త సీన్లు కలుస్తున్నాయ్!

10th, August 2016 - 09:13:28 AM

Srirastu-subamastu
అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా ఆగష్టు 5న పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తన కెరీర్‌కు ఉత్సాహాన్నిచ్చే ఓ మంచి విజయం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న శిరీష్‌కు ఈ సినిమా ఆ విజయాన్ని దాదాపుగా అందించేసింది. శిరీష్ కెరీర్లో ఇప్పటికే ఈ సినిమా హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించగా, వీక్ డేస్‌లోనూ సినిమాకు మంచి కలెక్షన్సే వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కొన్ని కొత్త సన్నివేశాలను కలపాలని టీమ్ నిర్ణయం తీసుకుంది.

అల్లు శిరీష్ – లావణ్య త్రిపాఠిల లవ్ ట్రాక్, అలీ కామెడీకి సంబంధించిన కొన్ని ఎడిటింగ్‌లో తీసేసిన సన్నివేశాలను కొత్తగా జత చేస్తున్నారు. గురువారం నుంచి అన్ని థియేటర్లలో ఈ కొత్త వర్షన్ ప్రదర్శితమవుతుందని శిరీష్ స్వయంగా తెలిపారు. గీతా ఆర్ట్స్ సంస్థ పెద్ద ఎత్తున నిర్మించిన ఈ సినిమాకు గతంలో ‘సోలో’, ‘సారొచ్చారు’ లాంటి కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కించిన పరశురామ్ దర్శకత్వం వహించారు.