‘పుల్లెల గోపీచంద్’ బయోపిక్ అప్డేట్స్ !

21st, August 2016 - 07:12:29 PM

gopi-chand
ఇప్పటి వరకూ ఎంతోమంది గొప్ప క్రీడాకారుల జీవితాలను సినిమాలుగా తీశారు. అదే బాటలో ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ ‘పుల్లెల గోపిచంద్’ జీవితం ఆధారంగా సినిమా తీయనున్నారు. రియో ఒలింపిక్స్ లో పివి సిందు వెండి పతాకం గెలవడంతో గోపీచంద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘సుధీర్ బాబు’ గోపీచంద్ పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు విజేత ‘ప్రవీణ్ సత్తారు’ దర్శకత్వం వహించనున్నాడట.

ఈ అంశంపై సుధీర్ బాబు మాట్లాడుతూ ‘గోపీచంద్ ఒక రియల్ హీరో, అతని కథ తప్పకుండా అందరికీ తెలియాలి, నాకు అతనితో ఆడిన అనుభవం ఉంది, అతన్ని దగ్గర్నుంచి చూశాను. అందుకే ఆ పాత్రలో సరోపోతాను’ అన్నారు. ఈ చిత్రం మొత్తం చాంపియన్ గా ఎదగడానికి జీవితంలో గోపీచంద్ పడ్డ కష్టాలు, ప్రేమకు, కెరీర్ కు మధ్య నలిగిపోయిన సందర్భాలు, వాటిపై అతను పోరాడి, గెలిచిన విధానం వంటి అంశాలపై ఉంటుందని తెలుస్తోంది. అలాగే నామా అభిషేక్ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందట. దీనికి సంబందించిన షూటింగ్ మొత్తం హైదరాబాద్, బెంగుళూరు, బర్మింగ్ హామ్ లలో జరగనుంది.