సెట్స్‌పైకెళ్ళిన నితిన్-హను రాఘవపూడి సినిమా!

6th, January 2017 - 08:30:17 AM

nithin-and-hanu-ragavapudi
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, తన కొత్త సినిమాను హీరో నితిన్‌తో చేస్తోన్న విషయం తెలిసిందే. ‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, హను రాఘవపూడితో ఓ రొమాంటిక్ కామెడీ కోసం జత కట్టారు. ఇక ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు హైద్రాబాద్‌లో షూటింగ్ మొదలుపెట్టింది.

దాదాపు 8 నెలల తర్వాత కెమెరా ముందుకొచ్చానని తెలుపుతూ నితిన్, తన కొత్త సినిమా మొదలైన విషయాన్ని తెలిపారు. హైద్రాబాద్‌లో ఒక షెడ్యూల్ ముగిసిన తర్వాత యూఎస్‌లో రెండు నెలల పాటు ఓ భారీ షెడ్యూల్ జరగనుందట. వేగాస్, సాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోల్లోని కథకు అవసరమైన పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరగనుందని సమాచారం. ఫిబ్రవరి నెలలో యూఎస్ షెడ్యూల్ మొదలవుతుంది. మే కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.