‘హైపర్‌’కి ఆడియో లాంచ్ ఉండదట!?

ram-hyper
‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా ‘హైపర్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 30న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ దసరా సీజన్లో వస్తోన్న సినిమాల్లో మొదట్నుంచీ మంచి క్రేజ్ సంపాదించుకున్న హైపర్, ప్రేక్షకులకు మరింతగా చేరాలన్న ఆలోచనతో టీమ్ ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేసింది. అయితే తెలుగులో పెద్ద సినిమాలకు ఆనవాయితీగా జరిగే ఆడియో ఫంక్షన్ హైపర్‌కు నిర్వహించడం లేదని తెలుస్తోంది.

ఆడియో ఫంక్షన్ కాకుండా ఒక్కో పాటను ఒక్కో టీవీ చానల్లో రామ్ స్వయంగా విడుదల చేస్తూ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఒక పాట విడుదల కాగా, ఈ సాయంత్రం మరో రెండు పాటలను విడుదల చేయనున్నారు. రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు.