‘మహేష్ 23’ ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే!


సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్‌ ప్రస్తుతం హైద్రాబాద్‍లో జరుగుతోంది. ఈనెలాఖర్లో పూర్తి కానున్న ఈ షెడ్యూల్ తర్వాత టీమ్ పూణే, ముంబైలలో మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఇక జనవరి నెలాఖర్లో ఫస్ట్‌లుక్ ఉంటుందని మొదట్నుంచీ ప్రచారం చేస్తూ వచ్చిన టీమ్, ఇప్పటికీ ఈ విషయమై ఏ ప్రకటనా చేయలేదు.

మొదట జనవరి 26నే ఫస్ట్‌లుక్ వస్తుందనుకుంటే ఆ రోజున ఎలాంటి ఫస్ట్‌లుక్ రాకపోగా, ఒక అప్‌డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం అందుతోన్న సమాచారం మేరకు ముంబై షెడ్యూల్ పూర్తైన తర్వాతే ఫస్ట్‌లుక్ విడుదల చేసే ఆలోచనలో మురుగదాస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి నెలాఖర్లో ఫస్ట్‌లుక్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు.