‘కబాలి’ విడుదలకు అడ్డంకులు..!?

kabali1
సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులంతా గత కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తోన్న రోజు రానే వస్తోంది. ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో వాలిపోనుంది. ఇక తమను ఎంతగానో ఎదురుచూయిస్తూ వస్తోన్న సినిమా కావడంతో, రజనీ అభిమానులంతా సినిమాను మొదటిరోజే చూసేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. తెలుగులోనూ ఈ సినిమాకు ఎక్కడిలేని క్రేజ్ కనిపిస్తోంది. అయితే అభిమానుల ఉత్సాహం ఇలా ఉంటే ‘కబాలి’ విడుదల విషయంలో నిన్న సాయంత్రం నుంచీ వినిపిస్తోన్న ఓ వార్త అందర్నీ కలవరపెడుతోంది.

అదే ఓ ప్రముఖ పంపిణీదారీ సంస్థ కబాలి విడుదలను ఆపే ప్రయత్నం చేస్తూ ఉండడం. నైజాంలో మంచి పేరున్న ఈ సంస్థ గతంలో రజనీ హీరోగా నటించిన కొచ్చాడియన్ (తెలుగులో విక్రమసింహ) అనే సినిమాతో భారీగా నష్టపోయింది. ఆ సినిమాతో సుమారు 7.5 కోట్లకు పైనే నష్టాలు మూటగట్టుకున్న ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, ఇప్పుడు ‘కబాలి’ విడుదలను ఆపేసి, తమకు న్యాయం చేయమని డిమాండ్ చేసేందుకు సిద్ధమయిందట.

ప్రస్తుతం ఇదే విషయమై తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయి. కొచ్చాడయన్ సినిమా అప్పటి నష్టాలను, తాను నటించే తదుపరి సినిమాలతో పూడుస్తానని రజనీ అప్పట్లోనే స్వయంగా మాటిచ్చారని డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాదిస్తోందని సమాచారం. కాగా ‘కబాలి’ సినిమా నిర్మాతలు, పంపిణీదారులు మాత్రం, ఈ వివాదం వెంటనే సమసిపోయేలా చర్యలు తీసుకుంటున్నారని, విడుదలకు ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా చూస్తున్నారని తెలుస్తోంది. నైజాం ఏరియాలో ‘కబాలి’ 300లకు పైగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదలవుతోంది.