ఎన్టీఆర్ సినిమా చేయమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు : కొరటాల శివ

koratala-siva
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా సెప్టెంబర్ 1న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో, టీమ్, ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ దర్శకుడు కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన గత చిత్రాల్లానే మంచి సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాగా జనతా గ్యారెజ్ తెరకెక్కిందని, ప్ర్రేక్షకులందరికీ సినిమా బాగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక తనతో సినిమా చేయమని ఎన్టీఆర్ ఒత్తిడి చేయడం వల్లే ఈ ప్రాజెక్టు చేశానని వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెబుతూ.. “ఎన్టీఆర్ నాకు సన్నిహితుడు. ఆయన ఓ సినిమా చేయమని ఒత్తిడి చేయడం ఏమిటి? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయిపోతా. ఆయన నన్ను సినిమా చేయమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. శ్రీమంతుడుకి ముందే ఈ కథ ఎన్టీఆర్‌కు చెప్పా. అప్పటికి ఆయనకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉండడంతో కుదర్లేదు” అని కొరటాల శివ అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.