అలాంటి అభిమానులు నాకొద్దు : ఎన్టీఆర్

28th, August 2016 - 04:39:28 PM

NTR
తెలుగు సినీ పరిశ్రమలో కొద్దిరోజులుగా అభిమానుల మధ్య గొడవలనేవి బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి గొడవల్లోనే చనిపోయిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి వెళ్ళడంతో అభిమానుల మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో బయటకొచ్చింది. ఇక ఇలాంటి గొడవలు రావడం బాధాకరమని తెలుపుతూ, హీరోలం తామంతా బాగానే కలిసి ఉన్నామని, అభిమానులు ఇలా గొడవలకు దిగడం మంచిది కాదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలిపారు.

‘జనతా గ్యారెజ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనకు, ‘అభిమానుల మధ్యన తలెత్తుతోన్న గొడవలపై మీరెలా స్పందిస్తారూ?’ అన్న ప్రశ్న తలెత్తగా, దానికి సమాధానమిస్తూ.. “అభిమానుల మధ్యన గొడవలు జరగడమనేది నేనే కాదు, ఏ హీరో కూడా సమర్థించడు. ఎవ్వరికైనా ముందు దేశంపై, ఆ తర్వాత తల్లిదండ్రులపై, భార్యా, పిల్లలపై, సన్నిహితులపై ప్రేమ ఉండాలి. ఇవన్నీ దాటాకే హీరో అనేవాడు ఉండాలి. గొడవల్లోకి నా అభిమానులు ఎప్పుడూ దిగరనే కోరుకుంటున్నా. ఒకవేళ అలాంటి అభిమానులు ఎవరైనా ఉంటే, నాకు అలాంటి అభిమానం వద్దు” అని అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారెజ్ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.