ఎన్టీఆర్ బిగ్ బాస్ షో సజావుగానే సాగుతుందా ?
Published on Jul 13, 2017 11:43 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తూ బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఈ షో టీవీల్లో ప్రదర్శితం కానుంది. దీంతో అభిమానులంతా తమ హీరోని బుల్లి తెరపై చూడబోతున్నామనే సంబరంలో ఉండగా మరోవైపు షో ఎలాంటి అడ్డంకులూ, వివాదాలు లేకుండా సజావుగానే సాగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

బాలీవుడ్లో మోస్ట్ కాంట్రవర్షియల్ షోగా పేరొందిన ఈ బిగ్ బాస్ ను ఈ మధ్యే కమల్ హాసన్ తమిళంలో చేస్తున్నారు. కానీ ఆ షో వలన తమిళ సంస్కృతికి అవమానం జరుగుతోందని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి షో నిలిపివేయాలని కొన్ని తమిళ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం తమిళనాట ఈ వివాదం ఒక హాట్ టాపిక్ గా నడుస్తోంది. తమిళంలో అంత వివాదాస్పదమై కమల్ హాసన్ చుట్టూ ఇబ్బందుల్ని అల్లిన బిగ్ బాస్ తెలుగులో కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుందనే అభిప్రాయలు వెలువడుతున్నాయి.

ఈ షో వలన ఎన్టీఆర్ కు ఇబ్బందులు తప్పవని, ఆయన ఆ షో చేయకుండా ఉంటేనే మంచిదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చీఫ్ రామకృష్ణ కూడా అభిప్రాయపడ్డారు. మరి ఎన్టీఆర్ ఈ అంశంపై పునరాలోచిస్తారో లేకపోతే కార్యక్రమంలో కొనసాగుతారో ఒకవేళ కొనసాగితే తెలుగు ప్రేక్షకులు షో ఎలా స్పందిస్తారో చూడాలి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook