ఎన్టీఆర్ కొత్త లుక్ : సినిమా కోసమేనా!?

14th, November 2016 - 11:49:37 AM

ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్‌లో మంచి దశలో ఉన్నారు. ఆయన హీరోగా చేసిన గత మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించినవే! ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా నిలిచి ఆయన క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికే రెండు నెలలు దాటినా ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఈ గ్యాప్‌లో చాలామంది దర్శకులతో ఎన్టీఆర్ సినిమా ఖరారైనట్లు వార్తలు వచ్చినా ఏదీ నిజం కాలేదు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి సరదాగా కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన లుక్‌లో కూడా పూర్తిగా మార్పు వచ్చింది. గడ్డం, మీసాలు పెంచి ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు రిసెప్షన్ వేడుకకు ఎన్టీఆర్ కూడా వచ్చారు. ఈ వేడుకలో ఆయనను చూసిన వారంతా ఆశ్చర్యపడుతున్నారు. పెద్ద పెద్ద మీసాలతో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ లుక్ సరదా కోసమేనా? లేదా ఏదైనా సినిమాను రహస్యంగా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతూ, ఆ సినిమా కోసం మార్చిన లుక్కా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!