‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడి ప్రయాణమిదీ!

‘ఒక్క అమ్మాయి తప్ప’ దర్శకుడి ప్రయాణమిదీ!

Published on Jun 1, 2016 3:53 PM IST

okka-ammayi-tappa
ఒక్క అమ్మాయి తప్ప… సందీప్ కిషన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌కు రిలీజ్‌కు సిద్ధమైపోయిన సినిమాల్లో ఒకటి. నిత్యా మీనన్ – సందీప్ కిషన్‌ల క్రేజీ కాంబినేషన్, ఒక్క అమ్మాయి తప్ప లాంటి టైటిల్‍తో మొదట్నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా, ట్రైలర్‌తో మంచి అంచనాలను పెంచింది. ముఖ్యంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నేపథ్యంలోనే జరిగే కథ కావడం ఈ సినిమా విషయంలో బాగా ఆసక్తికరంగా మారిన అంశం.

ఇక అసలు కథే సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతూ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతోన్న రాజసింహ, సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి తెలిపారు. “చిన్నప్పట్నుంచీ నాకు కథలంటే చాలా ఇష్టం ఉండేది. ఆ క్రమంలోనే చిన్నప్పుడే కథలు రాయడం మొదలుపెట్టా. అక్కడే క్రియేటివ్ ఫీల్డ్‌కు అంకం మొదలైంది. ఆ తర్వాత వెంట్రిలాకిజమ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకొని జీవిస్తున్న రోజుల్లోనే వెంకటేష్ గారికి చిన్నబ్బాయి అనే సినిమా కోసం వెంట్రిలాకిజం నేర్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రేమించుకుందాం రా అనే సినిమాకు అనుకోకుండా ఓ సన్నివేశం రాయాల్సిన అవసరం పడింది. నేను రాసిన ఆ సన్నివేశానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రచయితగా ఆ తర్వాత జయంత్ సీ పరాన్జీ గారితో కొన్నాళ్ళు ప్రయాణం సాగింది. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ దగ్గర కూడా ఆరేళ్ళ పాటు పనిచేశా. సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాకు కథా చర్చల్లో ఉన్నపుడే, ఆయనకు ఒక్క అమ్మాయి తప్ప’ కథ వినిపించా. అది తెరపై ఆవిష్కృతం అవ్వడానికి ఇంత సమయం పట్టింది” అన్నారు. ఒక్క కథ మీదే దర్శకుడు పదేళ్ళు కష్టపడడం ఒక్క అమ్మాయి తప్ప విషయంలో మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు