భారీ ధర పలికిన ‘ఓం నమో వెంకటేశాయ’ ఓవర్సీస్ హక్కులు

om-namo-venkatesaya

పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోల్లో ట్రెండ్ మార్చి కథాపరమైన చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్న నటుడు ‘నాగార్జున’. ప్రస్తుతం ఈయన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తిరస చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అన్నమయ్య’ చిత్రం భారీ విజయాన్ని సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై కూడ మంచి అంచనాలే ఉన్నాయి. కానీ తాజాగా అమ్ముడైన ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను చూస్తే మాత్రం ఆ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని అర్థమవుతోంది.

పేరు బయటకు రాలేదు కానీ ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి ఈ హక్కులను రూ. 6 కోట్ల పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. నాగార్జున గత సినిమాలన్నీ హిట్లవ్వడం, దర్శకేంద్రుడి కాంబినేషన్ పై ఉన్న నమ్మకం, తెలుగు ప్రేక్షకురాల్ని ఆకర్షించే విధంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుడు హాథిరామ్ బాబా జీవిత చరిత్ర కావడం వంటి అంశాలు ఇంత భారీ మొత్తం పలకడానికి కారణమని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.