‘ఓం నమో వెంకటేశాయ’లో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్!

om-namo-venkatesaya
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ కల్లా మొత్తం పూర్తవుతుందని, అయితే సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని నాగార్జున అన్నారు.

’ఓం నమో వెంకటేశాయ’లో చాలావారకు విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సన్నివేశాలు ఉంటాయని, వాటికి సరైన ఔట్‌పుట్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి సంక్రాంతికి సినిమా వస్తుందో లేదో చెప్పలేనని నాగార్జున అన్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్ చూసిన ప్రేక్షకులకు తక్కువ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తే తేలిపోతామని, అందుకనే ఓం నమో వెంకటేశాయ విజువల్ ఎఫెక్ట్స్‌పై టీమ్ బాగా కష్టపడుతుందని అన్నారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.