త్రివిక్రమ్ తర్వాత తెలుగులో బెస్ట్ రైటర్ పరశురామ్ : సుకుమార్

sukumar
తెలుగు సినీ పరిశ్రమలో త్రివిక్రమ్‌కు దర్శక, రచయితగా తిరుగులేని క్రేజ్ ఉంది. ఎంతో బలమైన భావోద్వేగాన్నైనా తన మాటలతో సునాయసంగా చెప్పగల సమర్థుడైన ఆయనకు, ఈతరం రచయితల్లో ది బెస్ట్ అన్న పేరుంది. ఇక అలాంటి త్రివిక్రమ్ తర్వాత తెలుగులో ఆ స్థాయి రచయితగా దర్శక రచయిత పరశురామ్ పేరు చెప్పుకోవచ్చని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. సున్నితమైన భావోద్వేగాలను తన డైలాగ్స్‌తో పరశురామ్ చాలా బాగా చెబుతారని ఆయన అన్నారు. ఈ ఉదయం హైద్రాబాద్‌లో జరిగిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ సుకుమార్, పై వ్యాఖ్యలు చేశారు.

పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా మంచి వసూళ్ళు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దర్శకరత్న దాసరి, ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, సుకుమార్ ఈ మీట్‌కు ముఖ్య అతిథులుగా హాజరై సినిమాపై ప్రశంసలు కురిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు.