అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు – పవన్ కళ్యాణ్

Published on Aug 22, 2021 2:03 pm IST


నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా చిరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ కూడా తన ఆన్నయ్యకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
‘చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయులు, చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి, ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని.

ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలన చిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్‌గా కీర్తి గడించినా..చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ పవన్ పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :