ఏపీకి ప్రత్యేక హోదాపై మళ్ళీ ధ్వజమెత్తిన పవన్!

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతూనే, రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పేరుతో పార్టీ నెలకొల్పి ప్రజా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిపించాలంటూ ఎప్పట్నుంచో నినదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమం మాదిరి యువత ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఓ పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఆయన అభిమానులు ప్రారంభించిన ప్రత్యేక హోదా పోరాటం సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం యువత ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇక వీరికి మద్దతు తెలుపుతూ కేంద్రం సౌతిండియాను పట్టించుకోవట్లేదని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువత మొదలుపెడుతోన్న పోరాటానికి తాను మద్దతిస్తానని తెలుపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ కళ్యాణ్‌ విమర్శలు గుప్పించారు.