పవన్ – త్రివిక్రమ్ – నితిన్ ల సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !


యంగ్ హీరో నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే త్రివిక్రమ్, నితిన్ ల కాంబినేషన్ ఎలా ఉంటుందో ‘అ.. ఆ’ సినిమాతో రుజువైపోయింది. ఇలాంటి ఈ రెండు ముచ్చటైన కాంబినేషన్లు కలిసి ఒకే సినిమా చేస్తే అభిమానులకు పండుగనే చెప్పాలి. ఈ ముగ్గురి కలయికలో పవన్, త్రివిక్రమ్ లు నిర్మాతాలుగా నితిన్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఆఖరులో ఈ సినిమా అనౌన్స్ అయింది.

స్క్రిప్ట్ కు సంబంధించి అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఈ జూన్ నెల 26న సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం హను రాఘవాపుడితో ‘లై’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న నితిన్ అది పూర్తవగానే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. ‘రౌడీ ఫెలో’ తో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా థమన్ సంగీతం అందించనున్నారు. ఇకపోతే నితిన్ యొక్క ఈ 25వ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.