‘కాటమరాయుడు’కి హైలైట్‌గా సీమ డైలాగులు!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ ప్రస్తుతం చివరి షెడ్యూల్‌కు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న వైజాగ్‌లో మొదలుకానున్న ఈ షెడ్యూల్ మొత్తం షూట్ పూర్తయ్యే వరకూ సాగనుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతంలోని ఓ పేరున్న వ్యక్తిగా కనిపించనున్నారు. దీంతో తెలుగు సినిమాకు సూపర్ హిట్ ఫార్ములా అయిన మాస్ సీమ డైలాగులు అదిరిపోతాయట. పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల మాండలికాలపై మంచి పట్టు ఉండడంతో ఇక ఈ డైలాగులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన వీరంకి రీమేక్‌గా ప్రచారం పొందుతోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మార్చి నెలాఖర్లో ఉగాది కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.