యూఎస్‍లో 1 మిలియన్‌కు దగ్గరైన పెళ్ళిచూపులు!

16th, August 2016 - 08:05:50 AM

Pellichoopulu
తెలుగు సినీ పరిశ్రమలో ‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడో వారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో కలెక్షన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. యూఎస్‌లో ఇప్పటివరకూ ఈ సినిమా ఎవ్వరిఊహకూ అందని రీతిలో 943కే డాలర్లు (సుమారు 6.31 కోట్లు) వసూలు చేసింది.

మరో రెండు మూడు రోజుల్లో సినిమా ఆ 1 మిలియన్ మైలురాయిని కూడా చేరుకోనుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల నుంచి సినిమా మంచి కితాబులందుకుంటోంది. రాజ్ కందుకూరి యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.