యూఎస్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా హవా!

Pellichoopulu
‘పెళ్ళిచూపులు’.. చిన్న సినిమాగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులూ, సినీ ప్రముఖుల దగ్గర్నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. దర్శకధీరుడు రాజమౌళి దగ్గర్నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో వసూళ్లు అదిరిపోయేలా ఉన్నాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సినిమా సూపర్ హిట్ స్థాయిని సొంతం చేసుకుంది.

మొదటి వారాంతం పూర్తయ్యే సరికి యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘పెళ్ళిచూపులు’ సినిమా 293కే డాలర్లు (సుమారు 1.96 కోట్లు) వసూలు చేసింది. కోటిన్నర బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిన్న సినిమాకు ఇది పెద్ద అచీవ్‌మెంట్‌గానే చెప్పుకోవాలి. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈతరం ప్రేమకథగా, రిఫ్రెషింగ్ కథనంతో ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. రాజ్ కందుకూరి, యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను డి.సురేష్ బాబు విడుదల చేశారు.