డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న ‘పెళ్లి చూపులు’
Published on Aug 3, 2016 11:17 am IST

Pellichoopulu
సినిమా చిన్నదైనా కథ బావుంటే పెద్ద హిట్టవుతుందనడానికి తాజాగా రిలీజైన ‘పెళ్లి చూపులు’ చిత్రమే నిదర్శనం. చిత్రాన్ని ముందుగా చూసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ‘సురేష్ బాబు’ గారు కథలో దమ్ముందని నమ్మి రిలీజుకు ముందే ధైర్యంగా ప్రివ్యూలు వేసి మరీ చూపించి చిత్రానికి కావలసినంత ఫ్రీ పబ్లిసిటీని మౌత్ టాక్ రూపంలోనే తీసుకొచ్చేశారు. దీంతో సినిమా చిన్నదే అయినా కూడా కాస్త పెద్ద అంచనాలతోనే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఏంతో రియలిస్టిక్ గా ఉండే ఈ సినిమా కథ ప్రేక్షకులకు ఓ కొత్త ఊపిరినిచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అలాగే చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు సైతం హాయిగా లాభాలను లెక్కేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో కలిపి 3 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక యూఎస్ లో అయితే 2 కోట్ల 20 లక్షలు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ ప్రభంజనం ఇంకా కొనసాగనుంది. కొత్త దర్శకుడు ‘తరుణ్ భాస్కర్’ తెరకెక్కించిన ఈ చిత్రంలో ‘విజయ్ దేవరకొండ, రీతు వర్మ’ జంటగా నటించారు.

 
Like us on Facebook