దయచేసి నా ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు రాయవద్దు – చిరంజీవి

Published on Jun 3, 2023 8:04 pm IST

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఆగష్టు 11న విడుదల కానుంది. ఇక మొదటి నుండి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ సహా అనేక సేవా కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా హైదరాబాద్, నానక్ రామ్ గూడలో సరికొత్తగా నెలకొల్పిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి పలు విషయాలు వెల్లడించిన చిరంజీవి పలువురు క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిని సన్మానించారు. క్యాన్సర్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించవద్దన్నారు.

ఆరంభంలోనే చికిత్స తీసుకుంటే దానిని జయించ వచ్చనన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కొందరు మీడియా వారు తప్పుగా ప్రచారం చేసి రాస్తున్నారని, దయచేసి అలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ ద్వారా తెలిపారు చిరంజీవి. ‘కొద్దిసేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను.

అందులో నాన్ క్యాన్సరస్ పాలిప్స్ ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు స్క్రీనింగ్ చేయించుకోవాలి అని మాత్రమే అన్నాను. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో నేను క్యాన్సర్ బారిన పడ్డాను అని చికిత్స వల్ల బతికాను అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలుపెట్టాయి.

దీని వల్ల అందరిలో అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. దయచేసి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’ అంటూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :