‘కబాలి’ టికెట్స్ కోసం ఎంత దూరం వెళుతున్నారంటే..!

kabali
ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాకు మొదటిరోజు ఎలాగైనా టికెట్స్ సంపాదించాలని అభిమానులు తహతహలాడుతూంటారు. అదీ రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే ఇక టికెట్స్ కోసం ఎంత కష్టపడాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ అనే సినిమా ప్రస్తుతం సౌతిండియన్ సినిమాను షేక్ చేసేస్తోంది. రేపు విడుదలవుతోన్న ఈ సినిమాకు ఎలాగైనా టికెట్స్ సంపాదించాలని అభిమానులు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా రజనీని ఓ దేవుడిగా కొలిచే తమిళనాడులో అయితే కొందరు అభిమానులు రాజకీయ నాయకుల రికమెండేషన్‌తో టికెట్స్ సంపాదించడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపైనే బాగా చర్చ జరుగుతోంది. ఓ వ్యక్తి కబాలి మొదటి షోకు సంబంధించిన టికెట్స్ కోసం ఒక రాజకీయ నాయకుడి రికమెండేషన్ పెట్టుకొని, థియేటర్ యజమాని దగ్గర్నుంచి టికెట్స్ సంపాదించుకోగలిగాడట. ఈ ఒక్క ఉదంతం చూస్తే ఇప్పుడు రజనీ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైపోతుంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ సినిమా అయిన కబాలి, రేపు ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లలో విడుదల కానుంది.