
నందిని రెడ్డి.. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారి తన వైపుకు తిరిగి చూసేలా చేసిన దర్శకురాలు. లేడీ డైరెక్టర్స్ ఎప్పుడో గానీ కనిపించని ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్, రెండో సినిమా ‘జబర్దస్త్’ పరాజయం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో మళ్ళీ తనదైన స్టైల్ రొమాంటిక్ కామెడీని సిద్ధం చేసేసి నాగ శౌర్య హీరోగా ‘కళ్యాణ వైభోగమే’ అంటూ మనముందుకు రానున్నారు.
గత కొద్దిరోజుల క్రితమే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ ఉదయమే డబ్బింగ్ పనులు మొదలుపెట్టినట్లు దర్శకురాలు నందిని రెడ్డి తెలియజేశారు. షూటింగ్ ఎంత ఎంజాయ్ చేశామో, డబ్బింగ్ కూడా అదే స్థాయి ఎంజాయ్‌మెంట్‌తో జరుగుతోందని నందిని రెడ్డి తెలిపారు. నాగశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూర్చారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.