హిట్ ఇచ్చిన దర్శకుడి కొడుకు కోసం ప్రభాస్

Published on May 22, 2021 1:33 am IST

ఆత్మీయులకు ప్రభాస్ ఎంత విలువ ఇస్తారో అందరికీ తెలుసు. వారి కోసం వీలైనంత సహకారం అందిస్తుంటారు. ప్రభాస్ కెరీర్లో మొట్టమొదటి పెద్ద హిట్ ‘వర్షం’. ఆ సినిమాతో ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ చిత్ర దర్శకుడు శోభన్. ఎంతో భవిష్యత్తు ఉన్న శోభన్ చిన్న వయసులోనే కాలం చేశారు. ఆయన కుమారుడు సంతోష్ శోభన్ కొన్నేళ్ళ క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా నిలదొక్కుకోవడం కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’.

కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకుడు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు నిర్మాతలు. కానీ లాక్ డౌన్ మూలంగా అది కుదరలేదు. దీంతో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభాస్ తన వంతుగా సినిమాను ప్రమోట్ చేశారు. సంతోష్ శోభన్ తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘నా కెరీర్లో వర్షం అనే మర్చిపోలేని హిట్ ఇచ్చారు శోభన్. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోష్ శోభన్ చేసిన ఏక్ మినీ కథ అమెజాన్ ద్వారా రిలీజవుతోంది. టీమ్ మొత్తానికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు’ అన్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రభాస్ సన్నిహితుల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ యొక్క అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :