శ్రీరాముడి కృప మాపై ఉంటుందని నమ్ముతున్నాం – ప్రభాస్

Published on Oct 3, 2022 12:02 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యం తో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్, ఓం రౌత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ఆదివారం సరయూ నది తీరాన శ్రీరాముడి జన్మ స్థలమైన అయోధ్య నగరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆదిపురుష్ భారీ పోస్టర్ రిలీజ్ చేశారు. చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది టీజర్ లో అద్భుతంగా చూపించారు.

టీజర్ విడుదల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ, “శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు అయోధ్య నగరానికి వచ్చాం. మొదట ఈ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. ప్రాజెక్ట్ అనుకున్న మూడు రోజుల తర్వాత దర్శకుడు ఓం రౌత్ కు ఫోన్ చేశాను. ఈ పాత్రలో మెప్పించేలా ఎలా నటించాలి అనేది మాట్లాడుకున్నాం. ప్రేమ, భయ భక్తులతో ఈ సినిమాను రూపొందించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులం అయ్యాం, శ్రీరాముడు దేవుడు అయ్యారు. శ్రీరాముడి కృప మాపై ఉంటుందని నమ్ముతున్నాం” అని అన్నారు.

సంబంధిత సమాచారం :