ప్రభాస్ కోసం మూడు భాషల్లో ఒకే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు !


‘బాహుబలి’ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఈ మధ్యే యంగ్ డైరెక్టర్, ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు సుజిత్ గట్టి గ్రౌండ్ వర్క్ చేసి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. ఇకపోతే కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రం యొక్క టైటిల్ ను ‘సాహో’ గా కన్ఫర్మ్ చేశారు.

తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లోనూ ఈ సినిమాకి ఇదే టైటిల్ ను ఖరారు చేశారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను ఏప్రిల్ 28 నుండి ‘బాహుబలి 2’ ను ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలోనూ వేయనున్నారు. అంతేగాక రేపు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందించనుండగా ‘శ్రీమంతుడు, ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.