తమిళ యువ దర్శకుడితో చేతులు కలపనున్న ప్రభాస్ ?

28th, March 2017 - 11:07:04 AM


ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని ప్రేక్షకులు, సినీ జనాలు ఆరాటపడుతున్న తరుణంలో రెబల్ స్టార్ తర్వాతి ప్రాజెక్టులపై ఆసక్తికర కథనాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్దమవుతున్న ప్రభాస్ అది పూర్తవగానే తమిళ యువ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తాడనే వార్తలు వినవస్తున్నాయి.

తమిళంలో ‘రాజా రాణి, తేరి’ వంటి సినిమాల్ని రూపొందించిన అట్లీ ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అది పూర్తవగానే అట్లీ ప్రభాస్ సినిమాకు సంబందించిన పనులు స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. మొన్న జరిగిన ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ వేడుకకు అట్లీ సతీ సమేతంగా హాజరవడం కూడా ఈ వార్తకు బలం చేకూర్చేలా ఉంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం బయటకొచ్చే వరకు కాస్త ఓపిక పట్టాలి.