ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె తన అరంగేట్రం చిత్రం ‘లైకీ లైకా’ కోసం పాడిన “ఛాప్ తిలక్” పాట తాజాగా విడుదలైంది. జీ మ్యూజిక్ విడుదల చేసిన ఈ మ్యూజిక్ వీడియోలో రాషా గాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సౌరభ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భావనా తల్వార్, రాఘవ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రాషా గానంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రశంసల జల్లు కురిపించారు. “రాషా, నీ సింగింగ్ డెబ్యూ చాలా బాగుంది. ‘ఛాప్ తిలక్’ పాటలో నీ పెర్ఫార్మెన్స్ ఎంతో నిజాయితీగా, మనసును హత్తుకునేలా ఉంది. ఆల్ ది బెస్ట్” అంటూ తన సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ప్రభాస్ చేసిన ఈ పోస్ట్‌ను రాషా రీ-షేర్ చేస్తూ, “ప్రభాస్ సార్.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ తన కృతజ్ఞతను చాటుకున్నారు.
కెరీర్ పరంగా రాషా ప్రస్తుతం అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌తో కలిసి ‘ఆజాద్’ చిత్రంతో నటిగా పరిచయమవుతున్న ఆమె.. ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నారు. ‘RX100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ సరసన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.
