‘బాహుబలి’ని నెక్స్ట్ సినిమా కోసం వాడుకుంటున్న ప్రభాస్ !

28th, February 2017 - 12:21:24 PM


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం మే నెల నుండి మొదలుకావాల్సి ఉంది. కానీ చిత్ర టీమ్ ఈ ప్లాన్ ని కాస్త మార్చారని తెలుస్తోంది. సుజీత్ ముందుగా మార్చి నెలలో సినిమాలోని కొంత భాగాన్ని షూట్ చేసి, దాని ద్వారా టీజర్ ను డెవలప్ చేస్తారట.

ఆ టీజర్ ను ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ కానున్న ‘భాహుబలి-2’ తో పాటు రిలీజ్ చేస్తారని కూడా వినికిడి. ఎందుకంటే ప్రపంచంవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో బాహుబలి -2 రిలీజవుతుంది కాబట్టి దానితో పాటే టీజర్ ను రిలీజ్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తే సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి ‘మిర్చి, శ్రీమంతుడు, ఘాజి’ ఫేమ్ మది కెమెరా వర్క్ చేస్తుండగా నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, పాపులర్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందించనున్నారు.