ప్రభాస్‌కు ‘బాహుబలి’ నుంచి విముక్తి!

baahubali
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‍ ‘బాహుబలి’ అనే ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా ఓ సరికొత్త స్టార్‌గా అవతరించిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి, బాహుబలి 2 అంటూ రెండు భాగాలుగా చేపట్టిన ఈ అతిపెద్ద సాహసంలో భాగమవ్వడం తన అదృష్టంగా భావించిన ప్రభాస్, మూడున్నర సంవత్సరాలుగా ఈ సినిమా కోసమే అంకితమయ్యారు. ఈ గ్యాప్‌లో సులువుగా రెండు, మూడు సినిమాలు చేయగల అవకాశం ఉన్నా, బాహుబలి కోసమే మొత్తం సమయాన్ని వెచ్చించిన ప్రభాస్, మొదటి భాగంతోనే అందుకు తగ్గ ఫలితాన్ని కూడా అందుకున్నారు.

ఇక ఏప్రిల్ నెలాఖర్లో విడుదల కానున్న రెండో భాగం ‘బాహుబలి 2’ కోసం కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుతూ వచ్చిన టీమ్, నేటితో షూటింగ్ మొత్తం పూర్తి చేసేసింది. ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలన్నీ ఈ ఉదయంతో పక్కాగా పూర్తయ్యాయి. ఇదే విషయాన్ని రాజమౌళి తెలియజేస్తూ ప్రభాస్ మూడున్నరేళ్ళుగా ‘బాహుబలి’ కోసం పడుతోన్న కష్టం చివరకు ముగిసిందని తెలిపారు. బాహుబలి విషయంలో తనను అందరికన్నా ప్రభాస్ ఎక్కువగా నమ్మాడని తెలుపుతూ ఆయనకు ఈ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.