ప్రకాష్ రాజ్ లైఫ్‌స్టైల్ చూస్తే అసూయగా ఉంటుంది : నాగార్జున

nagarjuna
తన విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మన ఊరి రామాయణం’ అన్న సినిమా కొద్దిరోజులుగా మంచి ఆసక్తి కలిగిస్తూ వస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో నిర్వహించారు. కింగ్ నాగార్జునతో పాటు పూరీ జగన్నాథ్, సుకుమార్, భోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ ఈ వేడుకకు హాజరై ప్రకాష్ రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ సందర్భంగానే ప్రకాష్ గురించి మాట్లాడుతూ నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎలాంటి పనినైనా ఇష్టంగా చేసేవాళ్ళలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఎప్పుడూ తనకు నచ్చిన పనినే చేస్తూ జీవిస్తుంటాడు. చేపలు పడతాడు, ఫామ్‌హౌస్‌లో పంటలు పండించుకుంటాడు, పిల్లలతో సరదాగా టూర్ వెళుతుంటాడు.. ఇలా తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడిపేస్తూంటాడు. ఇలాంటి జీవితమే గడపాలని ప్రయత్నించినా నాకది సాధ్యపడలేదు. ఈ లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా తనది చేసుకున్న ప్రకాష్ రాజ్‌ను చూస్తే అసూయ కలుగుతుంది.” అన్నారు. మన ఊరి రామాయణం పెద్ద విజయం సాధించాలని, ప్రకాష్ రాజ్‌కి ఈసారి దర్శకుడిగా జాతీయ అవార్డు రావాలని ఈసందర్భంగా నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రకాష్ రాజ్ గత చిత్రాల్లానే సహజమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.