
హీరో నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉండగానే మూడవ సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకుడు. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆయన ఆల్రెడీ మొదలుపెట్టి కొంత పూర్తిచేసిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ఇటలీలో రీస్టార్ట్ కానుంది. ఇందులో కథానయకిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక నితిన్ ఎంతో మక్కువతో చేస్తున్న చిత్రం ‘అంధాదూన్’ తెలుగు రీమేక్. మేర్లపాక గాంధీ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.
త్వరలోనే ‘రంగ్ దే’ ముగియనుండటంతో ఈ రీమేక్ చిత్రం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు టీమ్. ఆ సన్నాహకాల్లో భాగంగానే మేర్లపాక గాంధీ, ఆర్ట్ డైరెక్టర్ కలిసి లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు. చిత్రాన్ని వీలైనంతవరకూ సహజ సిద్ధమైన లొకేషన్లలోనే చిత్రీకరించాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇందులో కథానాయకిగా నభా నటేష్ నటించనుండగా ప్రధానమైన నెగెటివ్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించనుంది. ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు.