యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోన్న ‘ప్రేమమ్’ పాట!

23rd, August 2016 - 08:25:31 PM

premam
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగ చైతన్య రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి గత వారం విడుదలైన ‘ఎవరే’ అన్న పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ వస్తోంది. ఆగష్టు 17న విడుదలైన ఈ పాట సరిగ్గా నేటికి యూట్యూబ్‌లో 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.

రాజేష్ మురుగేశన్ అందించిన ట్యూన్‌కు విజయ్ యేసుదాసు గానం, శ్రీమణి సాహిత్యం తోడై ఈ పాటకు అద్భుతమైన ఫీల్ తెచ్చిపెట్టాయి. ఇక ఒరిజినల్ ప్రేమమ్ పాటలాగే హిట్ అయిన ఈ పాట సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ‘కార్తికేయ’తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్ అందించిన ఆడియో ఈనెల్లోనే విడుదల కానుంది.

‘ఎవరే’ పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి