ఇంటర్వ్యూ : సురేష్ బాబు – ‘నారప్ప’ గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా !

Published on Jul 18, 2021 3:28 pm IST

విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా ‘నారప్ప’ ఈ నెల 20వ తేదీ అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం.

 

‘నారప్ప’ను ఓటీటీలోనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ?

ఓటీటీనే ఎందుకు ? థియేటర్ లో ఎందుకు రిలీజ్ చేయడం లేదు అంటే.. చాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాని నేను కలైపులి ఎస్‌.థానుతో కలిసి నిర్మించాను. ఆయన ఓటీటీ వైపు ఆసక్తి చూపించారు. నాకు కూడా ఆ నిర్ణయమే బెటర్ అనిపించింది. ఎందుకంటే మేము ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కరోనా ప్రభావం చాల ఎక్కువగా ఉంది. అందుకే, ఓటీటీలో రిలీజ్ చేయాలని ముందుకు వెళ్ళాం.

 

మీ సహా నిర్మాత కలైపులి ఎస్‌.థాను ఎందుకు ఓటీటీ వైపు మొగ్గు చూపారు ?

కలైపులి ఎస్‌.థాను గత సినిమా కర్నన్‌ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేసారు. కానీ కరోనా కారణంగా ఆ సినిమా ఆడలేదు. సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు నష్టపోవడం జరిగింది. ఆయనకు ఆ భయం వల్ల నారప్ప సినిమాని ఓటీటీ వైపు ఇంట్రెస్ట్ చూపించారు. నిజానికి బిజినెస్ దృష్టిలో పెట్టుకునే నారప్ప సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నాము.

 

అయితే, నారప్ప ఓటీటీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు?

అవును అండి. ఫ్యాన్సే కాదు, వెంకటేష్ బాధ పడ్డాడు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫీల్ అయ్యాడు. నేను కూడా బాధ పడ్డాను. కానీ ప్రాక్టికల్ గా ముందుకు వెళ్లడమే కరెక్ట్. ఎందుకంటే ఇది మా ఒక్కరి సినిమా కాదు. సహా నిర్మాతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

 

కరెక్ట్ గా థియేటర్స్ ఓపెన్ అయ్యే టైంలో సురేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం స్వార్ధం అంటున్నారు ?

కచ్చితంగా అంటారు. అయితే ఇది ఒక్క సురేష్ బాబు తీసుకున్న నిర్ణయం కాదు. ఒకవేళ నేను థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే.. నా పార్ట్నర్ కి ఎలా అనిపిస్తోంది. మీ థియేటర్ బిజినెస్ కోసం నన్ను రిస్క్ లో పెడుతున్నారు అని నా పార్ట్నర్ కి అనిపించొచ్చు. అందుకే, మళ్ళీ చెబుతున్నాను. నా ఒక్కడి సినిమా అయితే, థియేటర్ రిలీజ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తాను.

 

‘అసురన్’ సినిమానే ఎందుకు రీమేక్ చేయాలని పిక్ చేసుకున్నారు ?

వెంకటేష్ సినిమా చూసి నన్ను ఒకసారి చూడమన్నారు. చూశాను, చాల బాగుంది. ముఖ్యంగా వెంకటేష్ బాబుకు చాల బాగా సూట్ అవుతుందని నేను ఫీల్ అయ్యాను. అలాగే వెంకటేష్ కి కూడా అసురన్ సినిమా బాగా నచ్చింది కాబట్టి, ఈ రీమేక్ చేయడం జరిగింది. నారప్ప గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా.

 

థియేటర్స్ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ?

థియేటర్స్ పరిస్థితి బాగా లేదండీ. లాస్ లో నడుస్తున్నాయి. నిజంగా ఇలాంటి సమయంలోనే ప్రభుత్వాలు థియేటర్స్ కు సపోర్ట్ చేయాలి. టికెట్ రేట్లు విషయంలో కొన్ని విజ్ఞప్తి చేశాము. వాటి గురించైనా ప్రభుత్వం ఆలోచించాలి.

 

థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆదరణ తగ్గుతుంది అంటున్నారు ?

నా దృష్టిలో థియేటర్స్ – ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సమానంగా మూవీ మార్కెట్ ను ఆక్యుపై చేస్తాయి. అయితే, థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఓటీటీలకు కొంత తగ్గొచ్చు కానీ, భవిష్యత్తులో ఓటీటీలు లీడ్ చేస్తాయి.

 

సినిమా నేటివిటీ విషయంలో కూడా చాల కేర్ తీసుకున్నారట ?

చాలా అండి. తమిళ నేటివిటీ ఎక్కువ లేకుండా ఉండటానికి, సినిమాలో మన నేటివిటీని బాగా ఎలివేట్ చేయాలని చాల చోట్ల షూట్ చేశాము. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో భయంతో చేశాము. ఉదాహరణకి మేము షూట్ చేస్తోన్న ఊరికి పక్క ఊరులో రెండు కోవిడ్ కేసులు వచ్చాయని మేము చేయకుండా ప్యాకప్ వచ్చేశాము. ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమా పూర్తి చేశాము.

 

శ్రీకాంత్ అడ్డాలనే ఎందుకు డైరెక్టర్ గా తీసుకున్నారు ?

శ్రీకాంత్ అడ్డాల నాకు ఒక కథ చెప్పడానికి వచ్చారు. కానీ బాధ బాగా లేదని చెప్పాను. ఆ సమయంలో మాట్లాడుతూ అసురన్ సినిమా రైట్స్ తీసుకున్నారట కదా, మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఆ సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉందని అన్నారు. అలా శ్రీకాంత్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. చాల బాగా తీశారు.

సంబంధిత సమాచారం :