బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన కమెడియన్!

Prudhvi
నటుడు పృథ్వీ తెలుసా అనడిగితే గుర్తు పట్టడానికి టైం తీసుకుంటారేమో, అదే ’30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’ తెలుసా? అంటే మాత్రం టక్కున గుర్తొచ్చేస్తారు. ‘ఖడ్గం’ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అన్న డైలాగ్‍తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న పృథ్వీ ప్రస్తుతం తెలుగులో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. ‘లౌక్యం’ నుంచి మొదలుకొని పెద్ద సినిమాలన్నింటిలో ఏదో విధమైన పాత్రతో మెప్పిస్తూ పృథ్వీ కమెడియన్‌గా పాపులర్ అయిపోయారు. అయితే తాజాగా ‘జక్కన్న’ అనే సినిమాలో ఆయన చేసిన కటకటాల కట్టప్ప అనే పాత్ర మాత్రం వివాదాస్పదంగా మారింది.

ఈ పాత్రలో నందమూరి నటసింహం బాలకృష్ణను అనుకరిస్తూ పృథ్వీ నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే తమ హీరో డైలాగులను అలా కామెడీ చేయడం నచ్చని బాలయ్య అభిమానులు పృథ్వీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పృథ్వీ మాట్లాడుతూ.. “బాలయ్యకు నేను ఎప్పట్నుంచో వీరాభిమానిని. ఆయన డైలాగ్స్ సినిమాలో వాడడం కేవలం సరాదా కోసం చేసిందే. బాలయ్య గారిని తక్కువ చేయాలన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు, రాదు. అది కేవలం సినిమా కోసమే సరదాగా నవ్వుకునేందుకు చేసిందే తప్ప, ఎవరినీ కించపరచాలని కాదు. జక్కన్న సినిమాలో నా పాత్ర చూసి హర్ట్ అయిన అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఇలాంటివి మళ్ళీ చేయను అని మాటిస్తున్నా” అని తెలిపారు. సునీల్ హీరోగా నటించిన ‘జక్కన్న’ సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.